Friday, November 8, 2013

Corporate Successful Stories...

ఒక శిల్పి రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం సంపాదించేందుకు అడవి మార్గాన వెళ్ళసాగాడు . మద్యాహ్నము భోజన వేళ కావడంతో ఒక చెట్టు కింద ఆగి, భోజనం చేసి, విశ్రాంతి తీసుకొను చుండగా, అక్కడ నేల మీది పడివున్న రాళ్ళు కనిపించాయి. అవి చదరంగా, నున్నగా ఉండటంతో, ఆతని లోని కళాకారుడు మేల్కొని, వెంటనే మొదటి రాతిని మలచ సాగాడు. శిల్పి యొక్క ఉలి దెబ్బలు తట్టుకోలేక ఆ రాయి, అమ్మా అబ్బా అని అరవసాగింది. అది విన్న శిల్పి కొంచెం చిరాకు చెంది, మరల తన పని ప్రారంభించాడు. ఈ సారి, ఆ రాయి, ఇంకాస్త గట్టిగా అమ్మా అబ్బా అని అరవసాగింది. దాంతో చిరాకు వచ్చిన శిల్పి, ఈ రాయి కాదులే అని దానిని పక్కన పెట్టి, పక్కనే ఉన్న రాయిని తీసుకొని పని మొదలు పెట్టాడు.
ఈ రెండవ రాయి, తన పుట్టుక, కర్తవ్యం తెలిసినది కనుక, శిల్పి దెబ్బలు ఓర్చుకొని మౌనంగా ఉంది. ఒక గంటి సేపు పనిచేసిన తరువాత, ఆ శిల్పి తను చెక్కిన శిల్పం వైపు చూసి, తృప్తి చెంది, మంచి శిల్పం చెక్కానన్న ఆనందంతో మరల తన ప్రయాణం మొదలు పెట్టాడు.

ఆ తరవాత కొంత సేపటికి, ఆ త్రోవ లోనే వెళుతున్న కొంత మంది బాటసారులు, ఆ చెట్టు కింద సేద తీరుదామని, అక్కడ కూర్చున్నారు. ఇంతలో, ఒక బాటసారి, అక్కడ చెక్కి ఉన్న రాయిని చుసి, ఆహా, ఎవరో మహాశిల్పి ఇక్కడ చక్కని దేవుని విగ్రహం చెక్కాడు అని ఆనందంతో, చక్కగా ఉన్న ఆ శిల్పాన్ని, ఆ పక్కనే ఉంచి, దగ్గరలోనే ఉన్న చెరువు లో నుంచి నీళ్ళు తెచ్చి, శిల్పాన్ని కడిగి, చెట్టు పూలు ఆ శిల్పం కాళ్ళ దగ్గర ఉంచాడు. మరొకామె తన వద్ద నున్న పసుపు, కుంకుమ, ఆ శిల్పం మీద వేసి, పక్కనే ఉన్న మొదటి రాయిని, దేవుని విగ్రహం ముందుకు జరిపి, ఆ రాయి మీద కొబ్బరి కాయ కొట్టింది.

తరవాత కొద్ది రోజులకే, ఆ దేవుడి విగ్రహానికి పూజలు మొదలై, ఆ మొదటి రాయిని, శాశ్వతంగా, కొబ్బరి కాయలు కొట్టే దానికింద మార్చారు...

అప్పుడు మొదటి రాయి, ఆహా, ఒక గంట దెబ్బలకి ఓర్చుకుంటే, హాయిగా గుళ్ళో పూజలు అందుకునేదాన్ని, ఆ కష్టం పడలేక పోవడం వల్ల, ఇప్పుడు జీవితాంతం దెబ్బలు తినవలసి వస్తోంది అని వాపోయింది.

కష్టాలను ఓర్చుకున్నవాడే గొప్పవాడు అవుతాడు !!!!!

1 comment: